గంట ప్రయాణంలో కరోనా పాజిటివ్

May 27, 2020
img

ఈరోజుల్లో విమాన ప్రయాణాలు కూడా ఎంత ప్రమాదమో ఈ సంఘటన నిరూపిస్తోంది. మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చెన్నై నుంచి కోయంబత్తూరుకు ఇండిగో 6E-381 విమానంలో బయలుదేరాడు. చెన్నైలో ప్రయాణికులు అందరికీ ధర్మల్ స్కానింగ్ చేసి ఎవరికీ కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకొన్న తరువాతే అందరినీ విమానంలోకి అనుమతించారు. విమానంలో కూడా అందరూ మాస్కూలు ధరించారు. మద్యలో ఒక సీటు వదిలి భౌతికదూరం కూడా పాటించారు. కానీ సుమారు గంటసేపు ప్రయాణం చేసి ఆ విమానం కోయంబత్తూరు చేరుకొన్నాక మళ్ళీ అక్కడ అందరికీ ధర్మల్ స్కానింగ్ చేసినప్పుడు వారిలో 24 ఏళ్ళు వయసున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. వెంటనే అతనికి రక్తపరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. 

దాంతో ఆ విమాన సిబ్బందిని, విమానంలో ప్రయాణించివారందరినీ 14 రోజులు క్వారెంటైన్‌కు పంపించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొన్న తరువాత కూడా ఒక గంటకంటే తక్కువ ప్రయాణంలోనే కరోనా సోకుతుంటే ఇక 5-10 గంటలు రైలు లేదా బస్సులలో ప్రయాణించవలసివస్తే పరిస్థితి ఏమిటి? లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన విమానయాన సంస్థలు, ఇప్పుడు భౌతికదూరం, కరోనా జాగ్రత్తల కారణంగా కొంత నష్టం భరించడానికి సిద్దపడినప్పటికీ, విమాన సిబ్బంది కూడా క్వారెంటైన్‌కు వెళ్లవలసి వస్తుంటే...కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందంటే విమానయాన సంస్థలు ఏవిధంగా విమానాలను నడిపించగలవు?ఈ లెక్కన కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు అంటే మరో 6-12 నెలలు ఇదేవిధంగా నడిపించాలంటే సాధ్యమేనా?

Related Post