దేశంలో కొత్తగా 254 కరోనా కేసులు నమోదు

April 07, 2020
img

కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం సాయంత్రం డిల్లీలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి దేశంలో కరోనా తాజా పరిస్థితులను వివరించారు. గత 24 గంటలలో దేశంలో కొత్తగా 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వాటితో కలిపి మొత్తం 4,421 కేసులు అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 117 మంది కరోనాతో మరణించారని, 326 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కరోనా వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 2,500 రైల్వే బోగీలలో 40,000 ఐసోలేషన్ పడకలు సిద్దం చేశామని తెలిపారు. ఈ ఐసోలేషన్ పడకలున్న  రైళ్ళను దేశంలో అవసరమైన ప్రాంతాలకు పంపిస్తామని లవ్ అగర్వాల్ చెప్పారు.     

లవ్ అగర్వాల్‌తో పాటు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఐసీఎంఆర్ ఎపిడ‌మాల‌జీ అధిప‌తి గంగాఖేద్క‌ర్‌, “దేశంలో మొత్తం 136 ప్రభుత్వ, 59 ప్రైవేట్ ల్యాబ్‌లలో ఇప్పటివరకు 1,07,006 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాము. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టలంటే దానిని వీలైనంత త్వరగా గుర్తించాలి. దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లలో సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తూ ఎప్పటికప్పుడు కరోనా రోగుల నివేదికలు అందజేస్తున్నారు,” అని అన్నారు. 

తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య మరికాస్త పెరిగినట్లు కనిపిస్తున్నా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు  చేపడుతున్న అనేక చర్యలు, లాక్‌డౌన్‌ వలన కరోనా వైరస్‌ విజృంబించకుండా అదుపులో ఉన్నట్లే కనిపిస్తోంది.   కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇదేవిధంగా మరికొన్ని రోజులు సమన్వయంతో పనిచేసినట్లయితే లాక్‌డౌన్‌ ముగిసే సమయానికి కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 

Related Post