అదిలాబాద్ జిల్లాలో తొలి కేసు కేరాఫ్ నిజాముద్దీన్

April 04, 2020
img

ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఉట్నూరు మండలంలో హస్నాపూర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ళ యువకుడు నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని తిరిగివచ్చాడు. ఆ మతసమావేశాలలో పాల్గొన్నవారి కోసం జిల్లా అధికారులు చేపట్టిన గాలింపు చర్యలలో ఆ యువకుడిని గుర్తించి వైద్య పరీక్షలు జరిపించగా అతనికి కరోనా పాజిటివ్ అని నేడు రిపోర్ట్ వచ్చింది. వెంటనే అతనిని అంబులెన్సులో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతనితో పాటు జిల్లా నుంచి మొత్తం 67 మంది నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొన్నట్లు గుర్తించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వారీనందరినీ క్వారంటైన్‌ శిబిరానికి తరలించారు. కరోనా సోకిన యువకుడి 15 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు జరిపారు. వారి రిపోర్టులు ఇంకా రావలసి ఉంది.

శనివారం ఉదయం 10.30 గంటల వరకు రాష్ట్రంలో 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 32 మంది కోలుకొన్నారు. 11 మంది మరణించారు. 

ఏపీలో శనివారం కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 180కి చేరుకొంది. 

దేశం మొత్తంగా చూస్తే 3127 కేసులు నమోదు కాగా 86 మంది చనిపోయారు. 

ప్రపంచవ్యాప్తంగా 11,19,426 కేసులు నమోదు కాగా 59,245 మంది కరోనాతో చనిపోయారు.    


Related Post