తెలంగాణలో 27 కొత్త కేసులు..మొత్తం 154

April 03, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 154కు చేరింది. ఇప్పటివరకు 128 మంది కరోనాకు చికిత్స పొందుతుండగా వారిలో 17 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. రాష్ట్రంలో 9 మంది కరోనాతో మృతి చెందారు. డిల్లీ, నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చినవారి కోసం జిల్లాల వారీగా చేపట్టిన గాలింపు చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే వారిలో చాలామందిని గుర్తించి కరోనా లక్షణాలున్నవారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు, వారితో సన్నిహితంగా తిరిగినవారిని కూడా గుర్తించి క్వారంటైన్‌లో ఉంచి మొత్తం 1,061 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి రిపోర్టులు రావలసి ఉంది. 

నిజాముద్దీన్ మతసమావేశాలకు హాజరైవచ్చినవారిలో జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తెలినవారి సంఖ్య ఈవిధంగా ఉంది. హైదరాబాద్‌-7, సంగారెడ్డి-6, సిద్ధిపేట-1, నల్గొండ-6, సూర్యాపేట-1, మహబూబ్‌నగర్‌-2, గజ్వేల్-ఒక కుటుంబం సభ్యులందరికీ, నాగర్ కర్నూల్-1, వనపర్తి-0, ములుగు-2, జనగామ-1, మహబూబాబాద్-1, వరంగల్‌ అర్బన్-(21మంది రిపోర్టు రావలసి ఉంది), హుజూరాబాద్-2, కామారెడ్డి-1, నిర్మల్-3, ఆసిఫాబాద్-ముగ్గురికి రిపోర్ట్ రావలసి ఉంది), అదిలాబాద్-(ఆరుగురికి రిపోర్టు రావలసి ఉంది). 

ఏపీలో కూడా నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని తిరిగి వచ్చినవారి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించడంతో నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 149కి చేరింది. గురువారం ఏపీలో కరోనాతో తొలి మరణం నమోదు అయ్యింది.    

కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,860 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 155 మంది కోలుకొన్నారు..53 మంది మరణించారు.

Related Post