గాంధీ ఆసుపత్రిలో వైద్యుడిపై కరోనా పేషంట్‌ దాడి!

April 02, 2020
img

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో బుదవారం సాయంత్రం ఒక కరోనా పేషంట్‌ వైద్యుడిపై దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపిన సమాచారం ప్రకారం కరోనా సోకిన ఇద్దరు అన్నదమ్ములు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారిలో 49 ఏళ్ళు వయసున్న అన్న బుదవారం సాయంత్రం చనిపోయాడు. దాంతో అదే ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న తమ్ముడు ఆవేశానికిలోనై ఆసుపత్రి వైద్యుడిపై దాడి చేశాడు. అన్న శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలనే దానిపై వారి మద్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బుదవారం సాయంత్రం జరిగింది.        

కరోనా వైరస్ సోకి చనిపోయినవారి శవాలను చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఖననం లేదా దహనం చేయవలసి ఉంటుంది. లేకుంటే అంత్యక్రియలకు హాజరయ్యే వ్యక్తులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. ఇదే విషయం వైద్యులు కరోనా చికిత్స పొందుతున్న తమ్ముడికి చెప్పాలని ప్రయత్నించినప్పుడు, అతను వైద్యుడిపై దాడి చేశాడు. 

తమ ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్సలు చేస్తుంటే రోగులు ఈవిధంగా తమపై దాడి చేయడం సరికాదని ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు. కరోనా మృతుల శవాలను పూర్తిగా స్టెరిలైజ్ చేసిన తరువాతే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. 

సమాచారం అందుకొన్న సిపి అంజని కుమార్ హుటాహుటిన గాంధీ ఆసుపత్రి చేరుకొని ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్‌తో మాట్లాడారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రిలో మరింత భద్రత పెంచి, లోపలకువచ్చిపోయేవారిని నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ ఫిర్యాదు మేరకు వైద్యునిపై దాడి చేసిన కరోనా రోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Related Post