తెలంగాణలో 97 కరోనా కేసులు

April 01, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా నిఖచ్చిగా లాక్‌డౌన్‌ అమలుచేస్తునందున త్వరలోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిలిచిపోతాయని సిఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఇంతవేగంగా కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే, నిజాముద్దీన్‌ మర్కజ్‌ మత సమావేశాలలో పాల్గొనేందుకు కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన విదేశీయులు వివిద రాష్ట్రాలలో యధేచ్చగా తిరగడం, వారు పాల్గొన్న ఆ సమావేశాలకు తెలంగాణతో సహా దేశంలో పలు రాష్ట్రాల నుంచి వెళ్ళి హాజరవడం వలననే అని తేలింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి అవుతోందనుకొంటున్న సమయంలో మళ్ళీ కొత్తగా 15 కేసులు నమోదు అవడంతో తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. 

మంగళవారంనాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 97కి చేరింది. వారిలో 77 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతూ కోలుకొంటున్నారు. మరో 14 మంది పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ మర్కజ్‌ మత సమావేశాలకు హాజరై తిరిగివచ్చినవారిలో ఆరుగురు మృతి చెందారు. 

మర్కజ్‌ మత సమావేశాలలో పాల్గొని తిరిగివచ్చినవారి ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తోందని గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం వారిని, వారి కుటుంబ సభ్యులను, వారు కలిసినవారిని అందరినీ గుర్తించి క్వారంటైన్‌ శిబిరాలకు తరలిస్తోంది. మత సమావేశాలకు హాజరై తిరిగివచ్చినవారు ఇంకా ఎవరైనా ఉంటే వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Related Post