డిల్లీ నుంచి తెలంగాణాకు కరోనా రవాణా!

March 31, 2020
img

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొందరు ప్రజల అజాగ్రత్త లేదా అవగాహనారాహిత్యం కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.

డిల్లీ నిజాముద్దీన్ వద్దగల ‘తబ్లిగి ఏ జమాత్ (ముస్లింల సమావేమందిరం)లో మార్చి 12 నుంచి 15వరకు వివిద దేశాల నుంచి వచ్చిన ముస్లిం మతభోదకులు సమావేశాలు నిర్వహించారు. వాటికి ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అనేక వందలమంది హాజరయ్యారు. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల నుంచే సుమారు 500 మందికి పైగా హాజరైనట్లు సమాచారం.

వారందరూ డిల్లీలో ఒకే చోట బస చేసి, ఒకేసారి కలిసివెళ్ళివచ్చారు. అప్పటికే ప్రపంచమంతటా కరోనా వైరస్‌ పాకిపోయిన సంగతి పట్టించుకోకుండా డిల్లీలో 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించడంతో వాటికి హాజరైనవారిలో చాలా మందికి కరోనా వైరస్‌ సోకి ఉండవచ్చని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనుమానిస్తున్నాయి. వాటికి హాజరైవచ్చిన 74 ఏళ్ళ వృద్ధుడు ఇటీవల మరణించిన తరువాత అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. డిల్లీలో మత సమావేశాలకు వెళ్ళి వచ్చినవారిలో ఆరుగురు వ్యక్తులు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాల్లో ఒకరు మృతి చెందారు. వారందరూ కరోనాతోనే మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

మర్కజ్‌ సమావేశాలకు వెళ్ళి వచ్చినవారు తిరిగి వచ్చిన తరువాత స్థానిక మసీదులలో సామూహిక ప్రార్ధనలు, సమావేశాలు నిర్వహించినట్లు ప్రభుత్వం గుర్తించింది. కనుక వారిద్వారా మరింతమందికి కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది కనుక మర్కజ్‌ సమావేశాలకు వెళ్ళి వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకువచ్చి తమ గురించి పోలీసులకు సమాచారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించి అవసరమైతే చికిత్స అందిస్తుందని తెలిపింది. రాష్ట్రంలో మర్కజ్‌ సమావేశాలకు వెళ్ళి వచ్చినవారి కోసం పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ బృందాలు గాలిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించి, ఆసుపత్రులకు తరలించి వారి ద్వారా మిగిలినవారిని కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోమవారం రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76కు చేరింది. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన విదేశీయులకు స్థానికంగా సేవలందించిన యువకుడికి కరోనా సోకింది. అతని తల్లి, సోదరికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.   

Related Post