తెలంగాణలో తొలి కరోనా మరణం

March 28, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా శనివారం కరోనా మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ళ వృద్దుడు ఈనెల 14న డిల్లీ వెళ్ళివచ్చాక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో సైఫాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొంటున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి చనిపోయారు. ఆయన శవాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షించగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా శనివారం సాయంత్రం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులందరినీ వెంటనే క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఇవాళ్ళ పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 59 నుంచి 65కి చేరింది. 

భారత్‌లో ఇప్పటి వరకు 909 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మంది చనిపోయారు. మహారాష్ట్రతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో రోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 180, కేరళ 176, తెలంగాణ-65, కర్ణాటక 55, రాజస్థాన్-54, యూపీ-54, గుజరాత్-45, తమిళనాడు-40, పంజాబ్-38, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 909 కేసులు నమోదు అయ్యాయి.

Related Post