సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి కరోనాకు అంకితం

March 27, 2020
img

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని, హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆసుపత్రులను పూర్తిగా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అవసరమైన మార్పులు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెండు ఆసుపత్రులలో అవసరమైన ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు, వైద్యులు, సిబ్బందికి కరోనా అంటకుండా ధరించే డిస్పోసబుల్ దుస్తులు, గ్లౌసులు, మాస్కూలు వగైరాలన్నీ ముందే సిద్దం చేయాలని ఆదేశించారు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వైద్య కళాశాలలు, వాటి అనుబంద ఆసుపత్రుల సేవలను కూడా ఉపయోగించుకొందామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

కరోనాను అరికట్టేంత వరకు వైద్యఆరోగ్యశాఖలో వైద్య సేవలతో నేరుగా సంబందం ఉన్న అన్ని విభాగాలలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రులలో సేవలందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, క్వారంటైన్‌లో ఉన్నవారిని నిరంతరం గమనించేందుకు ప్రజారోగ్య అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు.

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చాలా ప్రశంసించారని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. 

Related Post