కరోనా వైరస్‌ తాజా అప్‌డేట్స్

March 27, 2020
img

శుక్రవారం, ఉదయం 8.45 గంటలు: 

కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచదేశాలు విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ నానాటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనాను తక్కువగా అంచనా వేసి మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అమెరికా ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో గురువారం నాటికి 83,594 కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 1,300కు చేరుకొంది. దీంతో కరోనా వ్యాప్తిలో చైనా, ఇటలీ దేశాలను అమెరికా అధిగమించింది. చైనాలో ఇప్పటి వరకు 81,340, ఇటలీలో 80,589 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 5,00,542 కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 22,000 దాటింది. 

ఇక భారత్‌లో లాక్‌డౌన్‌ కొంత సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా కేసులు తగ్గనప్పటికీ లాక్‌డౌన్‌కు ముందు పరిస్థితితో పోలిస్తే కేసుల ఉదృతి కాస్త తగ్గిందని చెప్పారు. కనుక ఏప్రిల్ 14వరకు దేశప్రజలందరూ ఇళ్ళుదాటి బయటకు రాకుండా నిగ్రహించుకుంటే దేశంలో కరోనా వ్యాప్తి నిలిచిపోవచ్చునని అన్నారు. కనుక ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్‌... ఆంక్షలు యధాతధంగా కొనసాగించవలసిందేనని అన్నారు.   

వరల్డ్ మీటర్ గణాంకాల ప్రకారం గురువారం నాటికి భారత్‌లో 727 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది చనిపోయినట్లు సమాచారం. కానీ భారత కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ తెలిపినడాని ప్రకారం భారత్‌లో గురువారం కొత్తగా 90 కరోనా కేసులు నమోదు కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 694కి పెరిగింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 16కి చేరుకొంది.

తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. అయితే కరోనాకు గురై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారందరూ కోలుకొంటుండటం చాలా సంతోషకరమైన వార్త.

వివిద దేశాలలో ప్రస్తుతం కరోనా పరిస్థితులకు సంబందించి పూర్తి వివరాలకు:  https://www.worldometers.info/coronavirus/#countries 

Related Post