డా.వసంత్‌కు మతిస్థిమితం లేదు..అవినీతిపరుడు

February 14, 2020
img

గాంధీ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ వసంత్ ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాపిస్తోందంటూ పుకార్లు వ్యాపింపజేస్తున్నందుకు సస్పెండ్ చేయబడటం, దానికి నిరసనగా రెండు రోజుల క్రితం ఆయన పెట్రోల్ బాటిల్స్ తో వచ్చి ఆసుపత్రి ఆవరణలో ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడం, ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో ఈఎస్ఐ కంటే పెద్ద స్కామ్ జరుగుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

ఆయన ఆరోపణలపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రావణ్‌కుమార్‌ స్పందిస్తూ, “డాక్టర్ వసంత్ మతిస్థిమితం కోల్పోయారు. ఆయనకు మానసిక వైద్యుడితో చికిత్స అవసరం. గాంధీ ఆసుపత్రిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆయన చేసిన ఆరోపణలలో నిజం లేదు. నిజానికి ఆయనే ఆసుపత్రిలో అక్రమవసూళ్లకు పాల్పడేవారు. ఆసుపత్రిలో ఉన్న మూడు మెడికల్ షాపులు, క్యాంటీన్ నిర్వాహకులను, శానిటేషన్ కాంట్రాక్టర్లను నెలనెలా కమీషన్ ఇవ్వాలని డా. వసంత ఒత్తిడి చేసేవారని విచారణలో తేలింది. ఆయనే అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ తిరిగి నాపై, ఆసుపత్రి డీఎంఈ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన అక్రమ వసూళ్లకు ప్రయత్నించినట్లు మావద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయి. ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన ఆయనపై చర్యలు తీసుకొంటాము. ఆయనను మళ్ళీ ఆసుపత్రిలో విధులలోకి తీసుకోబోము. ఆసుపత్రి ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని కోరుతున్నాము,” అని అన్నారు. 

గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌పై మొదలైన ఈ రాద్దాంతం ఆసుపత్రిలో నెలకొన్న ఈ పరిస్థితులను బయటపెట్టడం విశేషం. డా.వసంత్ గాంధీ ఆసుపత్రిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించగా, ఆయనే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సాక్షాత్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రావణ్‌కుమార్‌ బయటపెట్టడం గమనిస్తే ఆసుపత్రిలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం అవుతున్నాయి. 

డా.వసంత్ మానసిక పరిస్థితి బాగోనప్పుడు ఆయనను వైద్యుడిగా రోగులకు చికిత్స చేయడానికి ఏవిధంగా అనుమతించారు? ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసినప్పుడు ఇంతకాలం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియవలసి ఉంది. 

Related Post