సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు

February 03, 2020
img

నేటి నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రోజుకు 30 మందికి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన టెస్ట్ కిట్లు కేంద్రం నుంచి వచ్చాయని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా గంటలోపుగానే కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకొనే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని కానీ విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి రాష్ట్రానికి వస్తున్నవారిలో ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం కలిగితే, ఇతరులెవరికీ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని నగరంలో గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రులలో వైద్యపరీక్షలు చేయించుకోవాలాని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని ఆసుపత్రులలో , మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని, అలాగే వైద్య పరీక్షలు, సేవలు అందించేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం అన్ని ఆసుపత్రులలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. కనుక ప్రజలు కరోనా వైరస్ గురించి వచ్చే పుకార్లను నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related Post