డెంగీ జ్వరాలను అదుపుచేయరా? హైకోర్టు ప్రశ్న

September 26, 2019
img

తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ, వైరల్ జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రోగులతో ప్రభుత్వాసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఈ సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన అనేక చర్యలు తీసుకొంటున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య తీవ్రత గురించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రోజూ వార్తలు వస్తుండటంతో అవి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ దృష్టిలో కూడా పడ్డాయి. 

ఇదే సమయంలో ఎం.కరుణ అనే వైద్యురాలు హైకోర్టులో ఓ ప్రజాహిత వాజ్యం వేశారు. రాష్ట్రంలో నానాటికీ విషజ్వరాలు పెరిగిపోతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తగినంత చర్యలు తీసుకోవడం లేదని ఆమె పిటిషన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ. అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుదవారం విచారణ చేపట్టి, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఓ ఆంగ్లదినపత్రికను చూపించి దానిలో ఈ విషజ్వరాల గురించి వచ్చిన వార్తలను స్వయంగా చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది ఈ జ్వరాలకు సంబందించి వైద్యఆరోగ్యశాఖ తరపున అందించిన గణాంకాలను, నివేదికను జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తీవ్రంగా ఆక్షేపించారు. మీడియాలో వస్తున్న వార్తలకు ఈ  గణాంకాలకు ఎక్కడా పొంతన లేదని ఆక్షేపించారు. తక్షణమే యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని లేకుంటే వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీ చేసి కోర్టుకు పిలిపించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 23కు వాయిదా వేశారు.

Related Post