కవలలకు జన్మనిచ్చిన బామ్మగారు

September 05, 2019
img

అవును...74 ఏళ్ళు వయసున్న మంగాయమ్మ అనే బామ్మగారు గుంటూరులోని అహల్య ఆసుపత్రిలో గురువారం ఆడ కవలలకు జన్మనిచ్చారు. మంగాయమ్మ తల్లి (94) నేటికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తున్నందున, మంగాయమ్మ కూడా ఈ వయసులో గర్భధారణ చేసినా తట్టుకోగలరనే నమ్మకంతో ఆమె అభ్యర్ధనను మన్నించమని వైద్యులు తెలిపారు. ఐవిఎఫ్ విధానంలో ఆమె గర్భం దాల్చేలా చేసామని, ఆరోజు నుంచే ఆమెను ఆసుపత్రిలో ఉంచుకొని గత తొమ్మిది నెలలుగా కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. ఈ వయసులో ఆమె సహజంగా జన్మనివ్వడం ప్రమాదకరం కనుక సిజేరియన్ ఆపరేషన్ చేసి కవలలను బయటకు తీశామని తెలిపారు. 

ఈ ఆపరేషన్‌లో మొత్తం 8 మంది వైద్యులు పాల్గొన్నారని, ప్రస్తుతం తల్లీ, పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పిల్లలిద్దరూ ప్రస్తుతం 1.4-1.5 కేజీలు బరువున్నారని, వారికి 2 కేజీలు బరువు వచ్చేవరకు తల్లీపిల్లలను ఆసుపత్రిలోనే ఉంచుకొని చూసుకొంటామని వైద్యులు తెలిపారు. 

మంగాయమ్మ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని నేలపర్తిపాడు. ఆమె కంటే 6-7 ఏళ్ళు వయసు ఎక్కువ ఉన్న ఆమె భర్త కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. వారికి పెళ్లై 57 సంవత్సరాలైంది. కానీ పిల్లలు కలుగకపోవడంతో ఇద్దరూ తీవ్ర ఆవేదన చెందేవారు. అందుబాటులోకి వచ్చిన ఐవిఎఫ్ విధానం గురించి తెలుసుకున్న ఆ వృద్ధదంపతులు, ఈ వయసులో ధైర్యం చేసి పిలలను కనేందుకు సిద్దపడ్డారు. వారి ధైర్యానికి మెచ్చి భగవంతుడు ఒకేసారి ఇద్దరు బిడ్డలను వరంగా ప్రసాదించాడు. 


74 ఏళ్ళ వయసులో గర్భం ధరించడం, ఆరోగ్యవంతమైన కవలలకు జన్మనివ్వడం ద్వారా మంగాయమ్మ సరికొత్త ప్రపంచరికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు 72 ఏళ్ళు ప్రపంచ రికార్డుగా ఉండేది. దానిని మంగాయమ్మ బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 

గతంలో ఇదే ఆసుపత్రిలో గుంటూరు జిల్లాలోని పల్నాడుకు చెందిన 60 ఏళ్ళు వయసున్న మహిళ ఒక పిల్లాడికి జన్మనిచ్చిందని, కానీ ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Related Post