కరీంనగర్‌లో హృదయవిదారకర ఘటన

September 03, 2019
img

కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఒక హృదయవిదారకర ఘటన జరిగింది. కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన సంపత్, కాలేయవ్యాధితో బాధపడుతున్న తన కూతురు లత(7)ను కొన్ని రోజుల క్రితం కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో చేర్పించాడు. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం పాప మరణించింది. కూతురు శవాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లడానికి తన వద్ద డబ్బులు లేవని కనుక అంబులెన్స్ ఏర్పాటు చేయవలసిందిగా సంపత్ ఆసుపత్రి అధికారులను బ్రతిమాలాడు. కానీ అంబులెన్స్ రిపేరులో ఉందని చెప్పి పాప శవాన్ని స్టెచ్చర్‌పై తీసుకువచ్చి ఆసుపత్రి బయట అతనికి అప్పగించేశారు. 

ఒకవైపు కన్నకూతురి మరణం, మరోవైపు అధికారుల నిర్లక్ష్య ధోరణితో సంపత్ కుమిలిపోయాడు. ఇక చేసేదేమీలేక కూతురు శవాన్ని చేతుల్లో పెట్టుకొని అక్కడే ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వెళ్ళి వారికి తన పరిస్థితి చెప్పుకొని సహాయం అర్ధించాడు. వారిలో ఒక ఆటో డ్రైవర్ ముందుకు వచ్చి, సంపత్‌ను, పాప శవాన్ని కూనారం గ్రామానికి తీసుకువెళ్లి దించివచ్చాడు. కనీసం ఆ ఆటో డ్రైవర్‌కున్న మానవత్వం, సానుభూతి కూడా ఆసుపత్రి సిబ్బందికి లేకపోవడం బాధాకరం. 

కరీంనగర్‌లో ప్రధాన ఆసుపత్రిలో అంబులెన్స్ పాడైతే ఆసుపత్రి అధికారులు దానిని వెంటనే రిపేర్ చేయించకపోవడం వలన అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకురావలసిన రోగులు కూడా తీవ్ర ఇబ్బందిపడతారనే సంగతి వారికి తెలియదనుకోలేము. కానీ నియమనిబందనలు, నిధుల కొరత అంటూ ఏవో కారణాలతో అంబులెన్స్ రిపేర్ చేయించకపోవడం చాలా బాధాకరం. 

ప్రభుత్వాసుపత్రులను సామాన్య ప్రజలకు మరింత అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తుంటే, కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు, వారి సహాయకులకు ఇటువంటి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు కూడా వస్తోంది.

Related Post