ఏపీలో అందరికీ ఆరోగ్యశ్రీ!

August 14, 2019
img

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పధకం ఎంతగా ప్రజాధారణ పొందుతోందో అందరికీ తెలుసు. ఆయన కుమారుడు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆ పధకాన్ని మరింత విస్తరించి ఏపీలోని మద్యతరగతి ప్రజలకు కూడా దానిని వర్తింపజేయబోతున్నారు. రూ.5 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారందరికీ ఈ పధకం వర్తింపజేయాలని నిర్ణయించినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీ నుంచి అర్హులైన ప్రజలందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాదు.. రూ.1,000కు మించి వైద్యఖర్చులను కూడా ఈ పధకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నెల నుంచే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలలో ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పధకం కింద వైద్య చికిత్సలకు అనుమతించబోతునట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ నూతనవిధివిధానాలను, మార్గదర్శకాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 

ప్రస్తుతం వైద్యచికిత్సలు ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందంటే, వైద్య పరీక్షలు చేయించుకుంటే రోగాలు  బయటపడతాయనే భయంతో సామాన్య ప్రజలు వైద్యపరీక్షలు చేయించుకోవడానికి కూడా వెనకడుతున్నారు. ప్రభుత్వాసుపత్రులలో సరైన వైద్యం లభించక, కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకునే స్థోమతలేక లక్షలాది ప్రజలు తీవ్రరోగాలతో బాధపడుతూ బ్రతుకే భారంగా జీవిస్తున్నారు. అయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యామాని ఆరోగ్యశ్రీ పధకం ద్వారా నిరుపేదలు మంచి వైద్యచికిత్సలు ఉచితంగా పొందగలుగుతున్నారు. కానీ ఆ పరిధిలోకి రాలేని మధ్యతరగతి ప్రజలు మాత్రం నేటికీ నానాబాధలు పడుతూనే ఉన్నారు. వారి సమస్యలను గుర్తించిన జగన్‌మోహన్‌రెడ్డి వారికి కూడా ఆరోగ్యశ్రీ పధకం పరిధిలోకి తీసుకువచ్చారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై మద్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Post