సర్వరోగ నివారిణి ఆరోగ్యశ్రీ

July 29, 2019
img

ఆరోగ్యశ్రీ పధకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1,000 రకాల జబ్బులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. కానీ వాటిలో కొన్ని రకాల జబ్బులతో ముడిపడే ఉండే ఇతర ఆరోగ్యసమస్యలకు వైద్య సౌకర్యం లభించడం లేదు. అలాగే ఆరోగ్యశ్రీలో ఉండే కొన్ని నిబందనల కారణంగా అవి ఆ పధకంలో భాగమే అయినప్పటికీ కొన్ని రకాల రోగాలకు చికిత్స చేయించుకోవడం కష్టమవుతోంది. కనుక ఆరోగ్యశ్రీలో ఆ నిబందనలను సడలించి అన్ని రకాల రోగాలకు వర్తింపజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్తగా చేర్చుతున్న అన్ని రకాల రోగాలకు అయ్యే ఖర్చులను కొంతవరకు పరిమితం చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పధకంలో అన్ని రకాల రోగాలకు మొదట ప్రభుత్వాసుపత్రులలోనే చికిత్సలు అందించాలని ఆ తరువాత కార్పొరేట్ ఆసుపత్రులకు విస్తరించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 

ఆరోగ్యశ్రీ పధకంలో ఇప్పటివరకు కిడ్నీ మార్పిడి రోగులకు మాత్రమే జీవితాంతం ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఇకపై కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నా రోగులకు కూడా ఈ పధకాన్ని వర్తింపజేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదిస్తోంది. 

ఈ పధకంలో భాగంగా గతంలో సాధారణ వినికిడి యంత్రానికి (హియరింగ్ ఎయిడ్)కు రూ.10,000 చెల్లిస్తుండగా, ఇకపై డిజిటల్ హియరింగ్ ఎయిడ్ కి రూ.15,000 అందజేయాలని ప్రతిపాదించింది.          ఈ ప్రతిపాదనలకు సిఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేస్తే తక్షణం అమలుచేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో బోధకాలు, హెచ్.ఐ.వి. భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.2,016 పింఛను ఇస్తోంది. ఆ పధకాన్ని కుష్టు, కిడ్నీ వైఫల్యం పొందిన రోగులకు కూడా వర్తింపజేయాలని వైద్య ఆరోగ్యశాఖ సిఎం కేసీఆర్‌ను కోరనుంది. 

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పధకంపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 800 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు అన్ని రకాల రోగాలకు ఈ పదకాన్ని వర్తింపజేయడం వలన రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా మరో రూ.100 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Post