వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం షాక్

June 24, 2019
img

తెలంగాణ ప్రభుత్వాసుపత్రులలో పనిచేస్తున్న 134 మంది వైద్యులకు ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఒకేసారి వారందరికీ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. త్వరలో మరికొంత మందికి కూడా నోటీసులు అందే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది రాష్ట్రంలో 31 జిల్లాలలో గల ప్రభుత్వాసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో గైనాకలాజీ, ఆర్దోపెడిక్, అనెస్తీషియా, ఈఎన్టీ, జనరల్ మెడిసన్, జనరల్ సర్జన్ తదితర మొత్తం 919 మంది వైద్య నిపుణులను ప్రభుత్వం నియమించింది. కానీ వారిలో సగానికి పైగా వైద్యులు జిల్లాలలో, గ్రామాలలో పనిచేయడానికి ఇష్టపడని కారణంగా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే జీతం కంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా సంపాదించేదే ఎక్కువ ఉండటంతో కొంతమంది వైద్యులు ఆ ఉద్యోగాలను వదులుకునేందుకు కూడా సిద్దపడినట్లు సమాచారం.

ఆ కారణంగా వారు సక్రమంగా విధులకు హాజరుకాకపోతుండటంతో ఆసుపత్రులలో చికిత్స లభించక రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వార్తలు తరచూ మీడియాలో వస్తుండటంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటోంది. ముఖ్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మ ఒడి, కంటివెలుగువంటి సంక్షేమపధకాలకు ఆటంకం ఏర్పడుతోంది. వైద్యులను నియమించుకొని వారికి భారీగా జీతాభత్యాలు కూడా చెల్లిస్తున్నప్పటికీ వారు విధులకు హాజరు కాకుండా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకొంటుండటంతో ప్రభుత్వం వారిపై కటిన చర్యలకు సిద్దమైంది. ఒకేసారి 134 మంది వైద్య నిపుణులకు షోకాజ్ నోటీసులు పంపించింది.

Related Post