48గంటలలో 36మంది పిల్లలుమృతి

June 12, 2019
img

నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు మెల్లమెల్లగా మెరుగుపడుతున్నప్పటికీ, నేటికీ అనేక తీవ్ర సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో చిన్న పిల్లల మరణాలు సర్వసాధారణమైపోయాయి. 

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గత రెండు రోజులలో 36మంది పిల్లలు చనిపోయారు. వారందరూ ఆసుపత్రులలో చికిత్స పొందుతునప్పుడే చనిపోతుండటం దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఆసుపత్రులలో చేరిన చిన్నారులలో అధికశాతం రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడం, ఆ కారణంగా మెదడువాపు, ఆ తరువాత కోమాలోకి జారుకొంటుండటం వంటి తీవ్ర ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. 

ప్రస్తుతం జిల్లాలోని శ్రీకృష్ణ ప్రభుత్వ వైద్యకళాశాలకు అనుబందంగా ఉన్న ఆసుపత్రిలో ఇటువంటి ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న మరో 133 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. 

ముఖ్యంగా వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో పిల్లలకు తగినంత నీళ్ళు, ఆహారం లభించకపోవడంతో అనేకమంది మృత్యువాత పడుతుంటారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌కే సాహి చెప్పారు. వారికి పౌష్టికాహారం అందించడం మాట అటుంచి కనీసం రెండుపూటలా గుప్పెడు మెతుకులు పెట్టలేని దుస్థితిలో తల్లితండ్రులు ఉన్నందున అనేకమంది చిన్నారులు ఇంత పసిప్రాయంలోనే మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా వందల సంఖ్యలో పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అంటే పిల్లల మరణాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్పష్టం అవుతోంది. మరి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏమి చేస్తోందో?

Related Post