బీబీనగర్ లోనే ఎయిమ్స్..పక్కా!

July 27, 2018
img

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ వద్ద ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా అందింది. ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు కోసం బీబీనగర్‌లో ఉన్న నీమ్స్ ఆసుపత్రి భవనాలను, ప్రస్తుతం ఉన్న స్థలానికి అదనంగా మరో 49ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించవలసిందిగా ఆ లేఖలో కోరింది. అవి తమకు స్వాధీనం చేసిన ఏడాదిలోగా ఎయిమ్స్ ఆసుపత్రికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వైద్యసేవలు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెరాస ఎంపి బూర నర్సయ్య గౌడ్ కు చెప్పారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎయిమ్స్ ఆసుపత్రికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా 33/11కేవీ విద్యుత్ సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆసుపత్రిలో వినియోగానికి సరిపడినంత నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రతిపాదిత ఎయిమ్స్ ఆసుపత్రిని సమీపంలోని జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు లైన్ల రోడ్లను నిర్మించాలని కోరారు. ఎయిమ్స్ ఆసుపత్రి సిద్దం అయ్యేలోగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకోవాలని జగత్ ప్రకాష్ నడ్డా ఎంపి బూర నర్సయ్య గౌడ్ కు సూచించారు. 

బీబీ నగర్ లో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం లిఖిత పూర్వకంగా ఆమోదం తెలిపింది కనుక ఇక అకక్డ ఎయిమ్స్ ఏర్పాటుకావడం తధ్యం. ఎయిమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీ కూడా వస్తుందని వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో అతిపెద్ద అత్యాధునిక సదుపాయాలున్న ఎయిమ్స్ ఆసుపత్రి బీబీ నగర్ లో ఏర్పాటు అవుతోంది కనుక ఆ పరిసర ప్రాంతాలన్నీ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎయిమ్స్ ఆసుపత్రి రాకతో భువనగిరి నియోజకవర్గం రూపురేఖలు మారిపోవడం ఖాయం.

Related Post