ఆ విషయంలో మనమే టాప్!

May 02, 2018
img

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) తాజాగా ప్రకటించిన ఒక నివేదికలో ప్రపంచంలో అత్యధికంగా వాయుకాలుష్యం ఉన్న 20 నగరాల పేర్లు ప్రకటించింది. వాటిలో మనవే 14 ఉన్నాయి. ‘పిఎం 2.5’ ప్రామాణికంగా తీసుకొని చేసిన సర్వేలో మన దేశంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాలలో డిల్లీ మొట్టమొదటి స్థానం ఆక్రమించింది. ఆ తరువాత స్థానాలలో వరుసగా వారణాసి, కాన్పూర్, ఫరీదాబాద్, గయా, పాట్నా, ఆగ్రా, ముజఫర్ నగర్, శ్రీనగర్, గుర్ గావ్, జైపూర్, పాటియాలా, జోద్ పూర్ ఉన్నాయి. వీటిలో 7 నగరాలు యూపిలోనే ఉండటం విశేషం. 

ఇక ‘పిఎం 10’ ప్రామాణికంగా తీసుకొని చేసిన సర్వేలో మన దేశంలో 13 నగరాలు అత్యంత ప్రమాదకరమైన వాయుకాలుష్యం కలిగి ఉన్నాయని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

ఈ నగరాలలో అత్యంత ప్రమాదకరమైన సల్ఫేట్, నైట్రేట్ మరియు బ్లాక్ కార్బన్ కణాలు గాలిలో చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తెలిపింది. ఈ వాయుకాలుష్యం కారణంగా ప్రపంచంలో శ్వాసకోశ వ్యాధులతో ఏటా సుమారు 38 లక్షల మంది చనిపోతుంటే వారిలో భారత్ కు చెందినవారు సుమారు 15 లక్షల వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గాలిలో ఉండే అత్యంత ప్రమాదకరమైనకణాలు శరీరంలో చేరడం వలన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి రోగాలబారిన పడి చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున వాయుకాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Related Post