హైదరాబాద్ యూనివర్సిటీలో మళ్ళీ అలజడి

November 11, 2017
img

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీలో శుక్రవారం మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హాస్టల్ లో కొందరు విద్యార్ధులు వార్డెన్లతో తరచూ గొడవపడుతున్నారనే కారణంతో పది మంది విద్యార్ధులపై యూనివర్సిటీ పాలకమండలి సస్పెండ్ చేసింది. అందుకు ఆగ్రహించిన విద్యార్ధులు శుక్రవారం యూనివర్సిటీ పాలకమండలి భవనాన్ని ముట్టడించి, విసి అప్పారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే విద్యారులపై సస్పెన్షన్ ఎత్తివేసి తరగతులకు అనుమతించాలని లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

విద్యార్ధుల అందోళనల కారణంగా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో విసి అప్పారావు ఆదేశాల మేరకు యూనివర్సిటీ అధికారులు పోలీసులకు కబురు చేయడంతో, భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని యూనివర్సిటీ అంతటా మొహరించారు. పోలీసుల రాకతో విద్యార్ధులు ఇంకా ఆవేశంతో రగిలిపోయారు. విద్యార్ధులు విసి అప్పారావు దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలియజేశారు. విసి అప్పారావు యూనివర్సిటీలోని దళిత, బిసి విద్యార్ధులను తరచూ ఏదో ఒక సాకుతో వేధిస్తున్నారని అయన తీరు మార్చుకోవాలని విద్యార్ధులు గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ ఉద్రిక్తంగానే ఉన్నాయి.

గత ఏడాది జనవరి 17వ తేదీన ఇదే యూనివర్సిటీలో  రోహిత్ వేముల అనే విద్యార్ధి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. విద్యార్ధులు చెపుతున్నదానిని బట్టి చూస్తే ఇప్పటికీ ఆ యూనివర్సిటీలో అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయని అర్ధం అవుతోంది. కనుక మళ్ళీ పరిస్థితులు చెయ్యి దాటిపోక మునుపే ప్రభుత్వం మేల్కొంటే మంచిదేమో? 

Related Post