తెరాస సర్కార్ కు కృష్ణయ్య చురకలు

November 09, 2017
img

ఈరోజు శాసనసభలో ఉపాద్యాయ ఉద్యోగాల భర్తీపై జరుగుతున్న చర్చలో తెదేపా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెరాస సర్కార్ చేస్తున్న కృషిని అభినందిస్తూనే, ఉద్యోగాల భర్తీ విషయంలో మాట మారుస్తోందని చురకలు వేశారు. “తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఇదే సభలో రాష్ట్రంలో సుమారు 20,000 కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటన్నిటినీ భర్తీ చేస్తామన్నారు. కానీ ఆ మరుసటి సంవత్సరం జరిగిన సమావేశాలలో సుమారు 12-16,000 పోస్టులు మాత్రమే ఉన్నాయని అన్నారు. కానీ మొన్న కేవలం 8,792  పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల విషయంలో మీరు చెపుతున్న గణాంకాలలోనే ఇంత తేడాలున్నాయి. కనీసం మీ గణాంకాలకు తగ్గట్లుగా ఉపాద్యాయుల భర్తీ చేయడం లేదు. 

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోనే ప్రాధమిక విద్యావ్యవస్థ బలోపేతం కాదు. అందుకు తగ్గట్లుగా ఉపాద్యాయుల భర్తీ కూడా జరిగినప్పుడే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. మీ ప్రభుత్వం విద్యార్ధులు-ఉపాద్యాయుల నిష్పత్తి ఆధారంగా ఉపాద్యాయులను భర్తీ చేయాలనుకోవడం సరికాదు. ఎంతమంది ఉపాద్యాయులు పదవీ విరమణ చేస్తున్నారో..ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటి ప్రకారం ఉపాద్యాయులను భర్తీ చేయాలి. 

అలాగే ఒలింపిక్ పోటీలలో మనకు పతకాలు రావట్లేదని బాధపడితే సరిపోదు. బాల్యం నుంచే విద్యార్ధులలో క్రీడాసక్తతి పెంచి, వారిలో ప్రతిభావంతులను గుర్తించి తగిన శిక్షణ ఇవ్వాలి. అందుకు ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ టీచర్లను కూడా నియమించడం చాలా అవసరం,” అని అన్నారు. ఆర్.కృష్ణయ్య తెరాస సర్కార్ కు ఇంకా అనేక విలువైన సూచనలు చేశారు.   

Related Post