దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్ కు సుప్రీం నో

November 04, 2017
img

దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్ కోర్సులను నిర్వహించడానికి వీలులేదని సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పింది. రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో నాలుగు యూనివర్సిటీలు దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆ నాలుగు డీమ్డ్ యూనివర్సిటీలు కావడంతో వాటిపై, అవి నిర్వహిస్తున్న ఈ పరీక్షలపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ)కి ఎటువంటి నియంత్రణా లేకుండాపోయింది. కనుక అవి ప్రయోగాత్మకంగా అభ్యసించవలసిన ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యలను దూరవిద్య ద్వారా శిక్షణ ఇస్తూ విద్యార్ధులకు సర్టిఫికేట్లు జారీ చేస్తున్నాయి.

రాజస్థాన్ రాష్ట్రంలో జె.ఆర్.ఎన్., ఐఏఎస్‌ఈ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్‌ లో ఎ.ఎ.ఐ., తమిళనాడులోని వి.ఎం.ఆర్.ఎఫ్. డీమ్డ్ యూనివర్సిటీలు 2001 నుంచి దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్ కోర్సులకు ఇచ్చిన డిగ్రీలను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది.

ఆ విద్యార్ధులకు ఇచ్చిన ఆ సర్టిఫికేట్లను వెంటనే వాపసు తీసుకొని వారు చెల్లించిన ఫీజులను మే 31లోగా తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నాలుగు డీమ్డ్ యూనివర్సిటీల ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీలు చేసి నష్టపోయిన విద్యార్ధులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ) నిర్వహించే వ్రాత పరీక్షలు, ప్రయోగ పరీక్షలకు హాజరయ్యి వాటిలో ఉత్తీర్ణులైనట్లయితే వారికి ఎఐసిటిఈ ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్లు ఇస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ పరీక్షలు వ్రాయదలచుకోని విద్యార్ధులకు సదరు యూనివర్సిటీలు వారు చెల్లించిన ఫీజులు వాపసు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 

2018-19 విద్యా సంవత్సరం నుంచి దేశంలో ఏ యూనివర్సిటీ కూడా ఎఐసిటిఈ అనుమతి లేకుండా దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్ వంటి సాంకేతికవిద్యను అందించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే ఇటీవల కాలంలో విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న డీమ్డ్ యూనివర్సిటీలపై కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికోసం త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేసి 2018,ఆగస్ట్ 31లోగా నివేదిక ఇవ్వాలని, దానిపై సెప్టెంబర్ 11న విచారణ చేపడతామని జస్టిస్ ఎ.కె.గోయల్, జస్టిస్ యు.యు.లలిత్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.  

Related Post