తెలంగాణాలో తెలుగు బాషకు పట్టాభిషేకం

September 13, 2017
img

ఈసారి ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్ననందున ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి తదితరులతో సమావేశమయ్యి వారి సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకొన్నారు. 

ఇక నుంచి తెలంగాణాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో 12వ తరగతి వరకు విధిగా తెలుగును భోదించాలి. ఈ నిబంధనకు కట్టుబడే విద్యాసంస్థలకే రాష్ట్రంలో అనుమతిస్తారు. రాష్ట్రంలో ముస్లిం విద్యార్ధులు కూడా ఎక్కువగానే ఉన్నందున వారు తెలుగుకు బదులు ఉర్దూను ఎంచుకోవచ్చు. ఇక నుంచి ప్రాధమిక స్థాయి నుంచి ఇంటర్ మీడియట్ వరకు తెలంగాణా సాహిత్య అకాడమీ తెలుగుపాఠ్యపుస్తకాల సిలబస్ రూపొందిస్తుంది. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు అకాడమి రూపొందించిన తెలుగు పాఠ్యపుస్తకాలనే తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందుకు విరుద్దంగా ఏవైనా విద్యాసంస్థలు వ్యవహరించినట్లయితే వాటిపై కటినమైన చర్యలు తీసుకోబడతాయి. 

అలాగే ఇక నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు తప్పనిసరిగా తెలుగులో వ్రాయబడిన బోర్డులను ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద అక్షరాలతో తెలుగులో పేర్లు వ్రాసుకొని వాటి క్రింద తమకు అవసరమనుకొన్న వేరే బాషలలో సంస్థలు, కార్యలయాల పేర్లు వ్రాసుకోవచ్చు. 

ప్రపంచ తెలుగు మహాసభలు డిశంబర్ 15-19 వరకు ఐదురోజులపాటు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో ఘనంగా నిర్వహించబడతాయి. ఇంకా నగరంలోని రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, శిల్ప కళావేదిక, భారతీయ విద్యా భవన్, పింగళి వెంకట్రామిరెడ్డి హాల్‌, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, నిజాం కళాశాల మైదానం, మొదలైన, ఇతర వేదికలలో కూడా సదస్సులు, సమావేశాలు, సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. ప్రముఖ కవి స్వర్గీయ సి నారాయణ రెడ్డి పేరిట హైదరాబాద్ లో ఒక స్మారక మందిరం త్వరలోనే నిర్మించబడుతుంది.

Related Post