యువతకు గొప్ప అవకాశం: ‘స్వయం’ ఉచిత ఆన్-లైన్ కోర్సులు

August 21, 2017
img

దేశంలో కోట్లాదిమంది విద్యార్ధులు, నిరుద్యోగ యువత ఆర్ధిక సమస్యల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్నారు. అటువంటి వారి కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పధకాలు, ఉపకార వేతనాలు, ఇతర సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ అవి అందరికీ అందే అవకాశం ఉండదు. కనుక కేంద్రప్రభుత్వం మరొక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చింది. ‘స్వయం’ అనే ఆన్-లైన్ కోర్సుల శిక్షణ పధకాన్ని ప్రారంభించింది. దీనిలో ఒకటీ రెండూ కాదు ఏకంగా 600 కోర్సులున్నాయి. విద్యార్ధులు, నిరుద్యోగ యువత వాటిలో తమకు నచ్చిన వాటిని ఎంచుకొని పూర్తిఉచితంగా శిక్షణ పొందవచ్చు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొన్నాక దానికి గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ కూడా ఇస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు తెలిపారు. 

ఈ కోర్సుల గురించి పూర్తి వివరాలు https://swayam.gov.in/publiccourse  లేదా https://swayam.gov.in/About  లలో లభిస్తాయి. కనుక దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. 

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళలో  బిఎడ్ డిఎడ్. డిగ్రీలు లేకుండా అధ్యాపకులుగా పనిచేస్తున్నవారికి కూడా దీని ద్వారానే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు జవదేకర్ చెప్పారు. కనుక దీనిలో శిక్షణ పొంది, సర్టిఫికెట్ల కోసం అభ్యర్ధులు సెప్టెంబర్ 15లోగా ఆన్-లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు జరుగుతున్న కసరత్తు దాదాపు పూర్తి కావచ్చిందని చెప్పారు. 

Related Post