మత్తుమందులు పట్టుబడితే కళాశాలల గుర్తింపు రద్దు!

July 07, 2017
img

ఇటీవల హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీ విద్యార్ధులు మత్తుమందులు సరఫరా అవుతున్న సంగతి బయటపడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది. ముందుగా నగరంలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తూ మాదకద్రవ్యాల నిరోధక అధికారులు లేఖలు వ్రాశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తూ పట్టుబడిన వారిని విచారించి వారిద్వారా ఈ దందాలో ఉన్న మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవిధంగా ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేయగలిగారు. ఒకవైపు మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న వారిని పట్టుకొనే ప్రయత్నాలు ముమ్మురం చేస్తూనే మరోవైపు వాటికి అలవాటు పడిన విద్యార్ధుల తల్లి తండ్రులను పిలిపించుకొని వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి రాష్ట్రంలో ప్రైవేట్, కార్పోరేట్ కాలేజీలు, కళాశాలల యాజమాన్యాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఏ కాలేజీ, స్కూల్లోనైనా మాదకద్రవ్యాలు పట్టుబడితే వాటి గుర్తింపు రద్దు చేస్తామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. దీనితో తమకు సంబంధం లేదని తల్లి తండ్రులది..ప్రభుత్వానిదే బాధ్యత అని తప్పించుకొనే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలలో ఈ సమస్యలేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో ఉపాద్యాయులు తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావద్దని సూచించారు. ఇకపై డీఈఓలు, విద్యాశాఖ అధికారులు తరచూ అన్ని స్కూళ్ళు, కాలేజీలలో తరచూ పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని మంత్రి సూచించారు.

Related Post