ప్రతిభకు పేదరికం సంకెళ్ళు

April 21, 2017
img

అంతరిక్షంలో మానవులు నివసించడానికి ఎటువంటి ఏర్పాట్లు అవసరమో తెలియజేసే ప్రాజెక్టును రూపొందించిన మెదక్ బాలిక రమ్య దానిని నాసా సదస్సులో వివరించడానికి అమెరికా వెళ్ళలేకపోవడం విచిత్రమే. అందుకు కారణం పేదరికమే. ఆమె మెదక్ జిల్లాలోని పిట్లంబెస్ కు చెందిన జ్యోతి, జీవన్ గౌడ్ దంపతుల కుమార్తె. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబమే అయినప్పటికీ రమ్య ఎప్పుడూ చదువులలో నెంబర్: 1 స్థానంలోనే ఉంది.నాసా వంటి ప్రముఖ సంస్థ నుంచి ఆహ్వానం అందుకొన్నందుకు సంతోషించాలో లేక పేదరికం కారణంగా అపూర్వమైన ఈ అవకాశాన్ని చేజార్చుకోవలసి వస్తునందుకు బాధపడాలో తెలియని పరిస్థితి.    

అంతరిక్షంలో మనవ ఆవాసాల ఏర్పాటు, సెటిల్ మెంట్ అనే అంశంపై నాసా నిర్వహించిన పోటీలో 150 దేశాలకు చెందిన విద్యార్ధి బృందాలు పాల్గొనగా వారిలో నిర్మల్ జిల్లా బాసరలో రాజీవ్ గాంధి టెక్నాలజీ అండ్ నాలెడ్జి యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్న రమ్య (మెదక్), విష్ణుప్రియ (ఖమ్మం), ప్రణయ్ (వరంగల్), ఆకాష్ అనే విద్యార్ధి బృందం రూపొందించిన విహాన్ ప్రాజెక్టుకు ద్వితియస్థానం లభించినట్లు నాసా మార్చి 28న ప్రకటించింది. వచ్చే నెల అంటే మే25న జరుగబోయే నాసా సదస్సులో పాల్గొనడానికి అమెరికా రావలసిందిగా ఆహ్వానించింది. 

బృందంలో మిగిలిన నలుగురు విద్యార్ధులు అమెరికా ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకొన్నట్లు తెలుస్తోంది. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన రమ్య మాత్రం అమెరికా వెళ్ళేందుకు డబ్బు లేకపోవడంతో ఈ గొప్ప అవకాశాన్ని చేజార్చుకోవలసి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లేదా స్వచ్చంద సంస్థలు లేదా దాతలు ఎవరైనా చేస్తే ఆర్ధికసహాయం తప్ప ఆమె ఈ సదస్సులో పాల్గొనే అవకాశం లేదు. తనకు సహాయపడాలని రమ్య, ఆమె తల్లితండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Post