తెలంగాణ ఇంటర్ విద్యార్దులకు శుభవార్త

November 05, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసిన, ఇంకా చదువుతున్న విద్యార్దులకు ఓ శుభవార్త! ఇంటర్ పూర్తయిన తరువాత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకొనే విద్యార్దులకు ఉచితంగా పోలీస్ శిక్షణ ఇప్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్దులు ఇంటర్మీడియెట్ చదువుకొంటూనే ఈ శిక్షణ పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం విద్యాశాఖ రాష్ట్రంలో 20 జిల్లా కేంద్రాలలోని జూనియర్ కాలేజీలను ఎంపిక చేసింది. వాటిలో పోలీస్ ట్రెయినింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారు. ఆయా కళాశాల ప్రిన్సిపాల్ దీనికి కొ-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. 

తొలుత ఒక్కో జిల్లా నుంచి 100 మంది చొప్పున విద్యార్దులను ఎంపిక చేసి వారికి ఈ పోలీస్ శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే విద్యార్దులకు తెలియజేసినందున చాలామంది దీని కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఇప్పటికే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్దులకు కూడా శిక్షణ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మోడల్స్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్దులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 300 మందికి పైగా విద్యార్దులు దరఖాస్తు చేసుకొన్నారు. 

పోలీస్ శిక్షణ పొందేందుకు అర్హతలు: 

పురుషులు: ప్రభుత్వ కళాశాలలోనే చదివిన విద్యార్దులకు మాత్రమే అవకాశం. వయసు 18 నుంచి 33 సంవత్సరాల మద్య ఉండాలి. పురుషులు 167.5 సెం.మీ ఎత్తు, ఛాతి 86.3 సెం.మీలు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు అదనంగా మరో 3 సెం.మీలు ఉండాలి. 

మహిళలు: 156.7 సెం.మీ ఎత్తు, ఛాతి 80 సెం.మీలు ఉండాలి. గాలి పీల్చినప్పుడు అదనంగా 3 సెం.మీలు ఉండాలి. 

దరఖాస్తు చేసుకొన్న విద్యార్దులకు ఆయా జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ్ళ  ఉదయం 10 గంటల నుంచి శారీరిక ధృఢత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి హాజరయ్యే విద్యార్దులు తప్పనిసరిగా తమ 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తీసుకువెళ్ళాలి. 

శిక్షణా కార్యక్రమం ఏవిధంగా అంటే... 

శారీరిక ధృఢత్వ పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్దులకు త్వరలోనే శిక్షణా కార్యక్రమం మొదలవుతుంది. ప్రతీరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఫిజికల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ తరువాత పోలీస్ కానిస్టేబిల్ ఉద్యోగాలకు సంబందించి పాఠాలు చెపుతారు. ఈ శిక్షణలో భాగంగా వర్తమాన పరిస్థితులు, లోకజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, శారీరిక, మానసిక  ఆరోగ్యం తదితర అంశాలపై నిపుణుల ప్రసంగాల ద్వారా విద్యార్దులకు అవగాహన పెంపొందిస్తారు. విద్యార్దులకు సిలబస్ పూర్తయ్యే వరకు లేదా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడేవరకు ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

ఈ శిక్షణ పొందిన విద్యార్దులకు పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇస్తామని ఎటువంటి హామీ ఇవ్వడు. కానీ ఈ శిక్షణ వలన విద్యార్దులు సులువుగా పోలీస్ కానిస్టేబిల్ ఉద్యోగాలకు అర్హత సాధించగలరు. విద్యార్దులకు పోలీస్ శిక్షణ ఇవ్వడం వలన సత్ప్రవర్తన, క్రమశిక్షణ అలవడుతుంది కనుక మంచి పౌరులుగా తయారవుతారు. ఒకవేళ పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించలేకపోయినా ఈ శిక్షణతో ఆర్మీ, నేవీ, వాయుసేనలలో ఉద్యోగాలవైపు వెళ్ళేందుకు దారి చూపినట్లవుతుంది. కనుక ఆసక్తి ఉన్న విద్యార్దులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా మంచిది.

Related Post