తెలంగాణ ఎంసెట్ విద్యార్దులకు శుభవార్త!

October 30, 2020
img

తెలంగాణ ఎంసెట్ విద్యార్దులకు శుభవార్త! ఎంసెట్ ప్రవేశపరీక్షలకు ఇంటర్ వెయిటేజ్ మార్కుల నిబందనను తొలగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ పరీక్షలు వ్రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. కరోనా కారణంగా ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి అందరికీ కనీస మార్కులు కేటాయించి పాస్ చేసిన సంగతి తెలిసిందే. కనుక ఆవిధంగా ఉత్తీర్ణులైనవారు ఎంసెట్ ప్రవేశపరీక్షలలో అర్హత సాధించినప్పటికీ వెయిటేజ్ మార్కుల నిబందన కారణంగా కౌన్సిలింగ్‌కు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో కొందరు విద్యార్దుల తల్లితండ్రులు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు జేఎన్టీయూని ఆదేశించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎంసెట్ కౌన్సిలింగ్‌కు ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉండాలనే నిబందనను తొలగించింది. కనుక ఇంటర్ వెయిటేజ్ మార్కులతో సంబందం లేకుండా ఎంసెట్ ప్రవేశపరీక్షలలో అర్హత సాధించిన విద్యార్దులందరూ ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరుకావచ్చు.


Related Post