పేద విద్యార్దులకు సహాయపడాలనుకొంటున్నారా?

September 23, 2020
img

కరోనా భయంతో నేటికీ స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది. కనుక రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు విద్యార్దులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకొనే విద్యార్ధులలో చాలామంది నిరుపేదకుటుంబాల నుంచి వచ్చినవారే ఉంటారని అందరికీ తెలుసు. కనుక వారు మొబైల్ ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్ టాప్, కంప్యూటర్స్, టీవీ వంటివి కొనుక్కోలేక ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. పేదరికం కారణంగా వారు విద్యకు దూరమవుతున్నారని గుర్తించిన ఓ స్వచ్ఛంద సంస్థ ‘స్మార్ట్ ఫోన్‌ లైబ్రెరీ’ అనే సరికొత్త ఆలోచనతో ముందుకువచ్చింది. చాలామంది కొత్త మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, కంప్యూటర్, టీవీలు కొన్నపుడు పాతవి ఎక్స్‌ఛేంజ్‌లో నామమాత్రపు ధరకి ఇచ్చేస్తుంటారు లేదా వాడకుండా వదిలేస్తుంటారు. పనిచేసే స్థితిలో ఉన్న అటువంటి నిరుపయోగమైన మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, కంప్యూటర్, టీవీలను సేకరించి నిరుపేద విద్యార్దులకు అందజేయడానికే ఈ ‘స్మార్ట్ ఫోన్‌ లైబ్రేరి’ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పారు. 

‘యూ అండ్ మీ’ మరియు ‘స్పూర్తి’ స్వచ్ఛంద సంస్థల సహాయసహకారాలతో బీవిరావు అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి సిద్ధిపేట జిల్లాలో నాగునూరు మండలంలోని మగ్దూంపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు సేకరించిన పాత మొబైల్ ఫోన్లను గ్రామంలో 15 మంది పేద విద్యార్దులకు అందజేశారు. మళ్ళీ పాఠశాలలు, కాలేజీలు తెరుచుకొన్న తరువాత ప్రజల వద్ద నుంచి సేకరించిన పాత మొబైల్ ఫోన్లు వగైరాలను కావాలనుకొంటే వెనక్కు తిరిగి ఇచ్చేస్తామని ‘స్మార్ట్ ఫోన్‌ లైబ్రేరి’ నిర్వాహకులు చెప్పారు.

కనుక పేద విద్యార్దులకు సహాయపడాలనుకొంటున్నవారెవరైనా సరే తమ ఇళ్ళలో నిరుపయోగంగా పడి ఉన్న పాత మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, కంప్యూటర్, టీవీలను తమకు అందజేయాలనుకొంటే http://www.sphoorti.org  వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తే నిర్వాహకులు వచ్చి వాటిని తీసుకువెళతారు. అలాగే మొబైల్ ఫోన్స్ కావలసిన పేద విద్యార్దులు కూడా పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లో మొబైల్ ఫోన్ల కోసం అభ్యర్ధించవచ్చు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కష్టకాలంలో పేద విద్యార్దులకు సహాయపడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Post