ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు డీట్

August 10, 2020
img

తెలంగాణ ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఉద్యోగాల భర్తీ కోసం ఆ సంస్థలు జాబ్ మేళాలు, క్యాంపాస్ సెలక్షన్లు నిర్వహిస్తుంటాయి. రాష్ట్రంలోని వివిద ప్రైవేట్ కంపెనీలలో ఉన్న ఖాళీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబందించి పూర్తి సమాచారం కేటగిరీల వారీగా విభజించి నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌లో అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర కార్మిక సంక్షేమ, ఉపాధి శాఖ “డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ” (డీట్) పేరుతో ఒక మొబైల్ యాప్‌ను రూపొందించింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనిలో ఓసారి రిజిస్ట్రేషన్ చేసుకొన్న తరువాత అభ్యర్ధులు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఇది ప్రభుత్వం రూపొందించినది కనుక దీనిలో రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్ధులు ఎటువంటి ఫీస్ చెల్లించనవసరం లేదు. 

డీట్‌లో రాష్ట్రవ్యాప్తంగా వివిద జిల్లాలో ఉన్న కంపెనీలలో ఉన్న ఖాళీలు, వాటికి సంబందించిన అర్హతలు వగైరా పూర్తివివరాలు కనిపిస్తాయి. నైపుణ్యం కలిగిన కార్మికులు (స్కిల్డ్), కొంచెం నైపుణ్యం కలిగినవారు (సెమీ స్కిల్డ్), ఎటువంటి నైపుణ్యం లేనివారు (హెల్పర్లు), కొత్తగా కాలేజీల నుంచి బయటకు వచ్చిన ఫ్రెషర్స్, మంచి అనుభవం ఉన్నవారు...ఇలా అందరికీ తగిన ఉద్యోగావకాశాలు డీట్ ద్వారా పొందవచ్చు. 

ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వం సంస్థలలో ఖాళీలు, భర్తీ ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. అలాగే వివిద కంపెనీలలో ఖాళీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబందించి ‘జాబ్ అలర్ట్స్ ఆప్షన్’ కూడా దీనిలో ఉంది. కనుక ఒకవేళ అభ్యర్ధులు మరిచిపోయినా వారికి తగిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన్నప్పుడు అలర్ట్ మెసేజ్‌లు వస్తాయి. 

డీట్‌లో ఐ‌టి, ఫార్మా కంపెనీలు, వివిద రకాల ఇతర పరిశ్రమలు, ఆర్ధిక, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, హోటల్స్, మీడియా తదితర పలు రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగ ప్రకటనలు ఇస్తాయి. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో డీట్‌లో నమోదు చేసుకొన్న అభ్యర్ధులను ఆన్‌లైన్‌లో లేదా ఫోన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేసుకొంటున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు డీట్ ఒక మంచి స్నేహితుడివంటిదని చెప్పవచ్చు. కనుక రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారందరూ వెంటనే తమ మొబైల్ ఫోన్లలో డీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొంటే మంచిది. డీట్‌ను జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌ఛేంజ్‌లతో కూడా అనుసంధానం చేయాలని కార్మికశాఖ భావిస్తోంది.

Related Post