నేడు ఇంటర్ మార్కుల మెమోలు విడుదల

July 31, 2020
img

తెలంగాణలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు వ్రాసి ఫెయిల్ అయిన విద్యార్దులకు ప్రస్తుత పరిస్థితులలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక అందరికీ కనీస పాస్ మార్కులు ఇచ్చి పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కనుక శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సవరించిన మార్కుల మెమోలను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టబోతున్నామని బోర్డు కార్యదర్శి సయ్యద్ జలీల్ తెలిపారు. విద్యార్దులు తమ మార్కుల మెమోలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.  

ఇంటర్ ఫలితాలు వెలువడినప్పటికీ కరోనా భయాల కారణంగా కాలేజీలు మళ్ళీ ఎప్పుడు తెరుచుకొంటాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కనుక విద్యార్దులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ముందుగా లెక్చరర్లకు శిక్షణ ఇస్తోంది. కానీ విద్యార్దులలో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే కనుక వారి వద్ద మొబైల్ ఫోన్‌, టాబ్లెట్ లేదా లాప్ టాప్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండవు. కనుక ముందుగా వాటిని విద్యార్దులకు సమకూరిస్తేనే ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహణ సాధ్యం అవుతుంది. లేకుంటే కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకు విద్యా సంవత్సరాన్ని వాయిదా వేయక తప్పదేమో? 

Related Post