తెలంగాణలో ఇంటర్ ఆన్‌లైన్‌ క్లాసులు?

July 14, 2020
img

రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున ఇంటర్మీడియెట్ విద్యార్దులకు అవసరమైతే ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సిద్దం అవుతోంది. రాష్ట్రంలో మొత్తం 5,300 మంది లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 441 మంది చొప్పున 12 బ్యాచ్‌లుగా చేసి రోజుకు 6 గంటల చొప్పున రెండురోజులపాటు శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో ఈ ‘డిజిటల్ దిశ’ శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిస్తారని జలీల్ తెలిపారు. 

కరోనా మహమ్మారి సర్వత్రా వ్యాపించి ఉన్నందున ఇప్పుడు తరగతి గదులలో కూర్చొని చదువుకొనే పరిస్థితులు లేవనే అర్ధమవుతోంది. కనుక ‘కేజీ టూ పీజీ’ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు అనివార్యంగానే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే గమనించి ఇంటర్ బోర్డు  అందుకు సిద్దం అవుతుండటం చాలా అభినందనీయమే. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు, కాలేజీలలో పనిచేసే లెక్చరర్లకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించే అనుభవం లేదు కనుక వారికి శిక్షణ ఇవ్వడం చాలా అవసరమే. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదివే విద్యార్దులలో చాలామంది పేదవారే  ఉంటారు కనుక వారిలో ఎంతమంది వద్ద కంప్యూటర్లు లేదా ల్యాప్ టాపులు, ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు ఉంటాయి?వాటిలో ఇంటర్నెట్ కనెక్షన్, డాటా ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ ఎవరి దగ్గరా లేకపోతే ఆన్‌లైన్‌ క్లాసులు ఏవిధంగా నిర్వహిస్తారు?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఒకవేళ ప్రభుత్వమే వారికి ల్యాప్ టాపులో లేదా టాబ్లెట్లో పంపిణీ చేసి వాటికి ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినా విద్యార్దులు శ్రద్దగా ఆన్‌లైన్‌లో క్లాసులు వింటారా అంటే అనుమానమే. కనుక ఈ సమస్యలపై కూడా విద్యాశాఖ దృష్టిపెట్టి వీటికి పరిష్కారాలు కనుగొనడం చాలా అవసరం. 

Related Post