చైనాపై కోపం...భారత్‌ విద్యార్దులకు కష్టం!

July 10, 2020
img

భారత్‌-చైనా సరిహద్దుల వద్ద పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ, చైనా ఉత్పత్తులపై నిషేదం, ఆంక్షలు, ఒప్పందాల రద్దు వంటివాటితో భారత్‌ పరోక్షయుద్దం కొనసాగిస్తూనే ఉంది. అయితే చైనాపై కోపంతో కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకొన్న ఓ నిర్ణయం చైనాలో వైద్యవిద్యనభ్యసిస్తున్న భారతీయ వైద్య విద్యార్ధులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. 

భారత్‌లో వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశం లభించనివారు చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిపిన్స్ వంటి ఇతరదేశాలలో ఎంబీబీఎఎస్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. భారత్‌లో ఎంబీబీఎఎస్‌కు నాలుగేళ్ళు, హౌస్ సర్జన్‌ మరో రెండేళ్ళు వేర్వేరుగా పూర్తి చేయవలసి ఉంటుంది. కానీ విదేశాలలో రెండూ కలిపి ఒకేసారి ఎంబీబీఎఎస్ పేరుతోనే ఆరేళ్ళలో పూర్తవుతుంది. అయితే విదేశాలలో ఆరేళ్ళు వైద్యవిద్య అభ్యసించివచ్చినవారు భారత్‌లో హౌస్ సర్జన్‌గా గుర్తింపు పొందాలంటే తప్పనిసరిగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పరీక్ష వ్రాసి పాస్ అయిన తరువాత ఏడాదిపాటు భారత్‌లో హౌస్ సర్జన్‌గా చేయవలసి ఉంటుంది.

అయితే విదేశాలలో 5 ఏళ్ళు ఎంబీబీఎఎస్ కోర్సు పూర్తిచేసిన తరువాత (ఎఫ్ఎంజీఈ) పరీక్ష వ్రాసేందుకు ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం అనుమతించేది. కానీ ఇకపై చైనాలో ఆరేళ్ళు ఎంబీబీఎఎస్ కోర్సు పూర్తిచేసిన తరువాతే ఎఫ్ఎంజీఈ పరీక్ష వ్రాసేందుకు అనుమతించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీని వలన చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న వేలాదిమంది భారతీయ విద్యార్దులు, వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వలన ఒక ఏడాది వృధా అయిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనాపై కోపం ఉంటే దానిపైనే తీర్చుకోవాలి కానీ మద్యలో తమకు నష్టం కలిగించడమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. 

Related Post