తెలంగాణ ఇంటర్ ద్వితీయ విద్యార్దులందరూ పాస్

July 10, 2020
img

తెలంగాణ ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలలో 1,61,710 మంది విద్యార్దులు ఫెయిల్ అయ్యారు. వారందరికీ మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించవలసి ఉంది కానీ కరోనా కారణంగా పరీక్షలు వాయిదాపడ్డాయి. రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి ఫెయిల్ అయిన విద్యార్దులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటించారు. అయితే ఈ విద్యార్దులందరూ కంపార్టుమెంట్ పద్దతిలో పాసైనట్లు మార్కుల మేమోలో పేర్కొంటామని తెలిపారు. ప్రధమ సంవత్సరంలో బ్యాక్ లాగ్‌లున్న విద్యార్దులను కూడా పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కామ్ ఫోటోకాపీల కోసం దరఖాస్తు చేసుకొన్న విద్యార్దుల ఫలితాలను మరో 10 రోజులలో తెలియజేస్తామని చెప్పారు. ఈనెల 31 తరువాత విద్యార్దులు తమతమ కాలేజీలకు వెళ్ళి మార్కుల మెమోలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్దులు ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేయాలని సిఎం కేసీఆర్‌ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఇంటర్మీడియెట్ ప్రధమ సంవత్సరం వార్షిక పరీక్షలలో కూడా 1,67,630 మంది విద్యార్దులు ఫెయిల్ అయ్యారు. కరోనా నేపధ్యంలో ఇంటర్ ద్వితీయ విద్యార్దుల సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసినందున, ప్రధమ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్దులకు కూడా అదే వర్తిస్తుందనుకొంటే వారినీ పాస్ చేయవలసి ఉంటుంది. కానీ వారి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Post