సీఏ పరీక్షలు నవంబర్‌కు వాయిదా

July 04, 2020
img

కరోనా కారణంగా ఇప్పటికే పలు పరీక్షలు రద్దయ్యాయి. జేఈఈ, నీట్ వంటి పరీక్షలు వాయిదాపడ్డాయి. తాజాగా ఛార్టడ్‌ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలు కూడా నవంబర్‌కు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించింది. అప్పటికీ కరోనా తీవ్రత తగ్గకపోతే అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తామని, వాటికి హాజరవ్వాలా వద్దా...అనే ఆప్షన్ విద్యార్దులకే ఇస్తామని తెలిపింది. 

షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే 2 నుంచి 18వరకు సీఏ పరీక్షలు జరుగవలసి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా జూన్‌కు వాయిదాపడ్డాయి. కానీ కరోనా తీవ్రత పెరిగిపోవడంతో జూలై 29కి వాయిదా పడ్డాయి. కానీ అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇప్పుడు ఏకంగా నవంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు ఐసీఏఐ ప్రకటించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్యమైన పరీక్షలు ఇన్ని నెలలు వాయిదాపడుతుండటం వలన విద్యార్ధుల విలువైన సమయం వృధా అయిపోతోంది. వారు, వారి తల్లితండ్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కానీ కరోనా ముందు ఎంతటివారైనా తలవంచక తప్పడం లేదు.

Related Post