జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా

July 04, 2020
img

కరోనా నేపధ్యంలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌, నీట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేంద్రమానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్ పోఖృయాల్ శుక్రవారం ప్రకటించారు. ఈ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు, వచ్చే నెలలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరుగవలసి ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో పరీక్షలు నిర్వహిస్తే లక్షలాదిమంది విద్యార్దులు వాటికి హాజరవుతారు కనుక వారి భద్రత దృష్టిలో పెట్టుకొని నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

జేఈఈ మెయిన్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు, నీట్‌ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్‌ 13న, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను సెప్టెంబర్‌ 27న నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి దేశంలో కరోనా పూర్తిగా కట్టడిలోకి వస్తుందని భావిస్తున్నామని, కనుక పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఆటంకం ఉండబోదని ఆశిస్తున్నామని చెప్పారు. 

ఈ పరీక్షలు సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి కనుక ఒకవేళ అప్పటికైనా పరీక్షలు నిర్వహించగలిగితే అక్టోబర్‌లో వాటి ఫలితాలు వెలువడుతాయి. కనుక అదే నెలలో ఐఐటి, ట్రిపుల్ ఐ‌టి, జీఎఫ్టిఐ తదితర ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినట్లయితే నవంబర్‌ లేదా డిసెంబర్‌లో తరగతులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

Related Post