కరోనా కారణంగా దోస్త్ ప్రక్రియ వాయిదా

July 02, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో జూలై 1 నుంచి ప్రారంభం కావలసిన డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసస్ తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ కాలేజీలలో ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. పరిస్థితులను సమీక్షించి మళ్ళీ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని లింబాద్రి తెలిపారు. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు కూడా పెరిగిపోతుండటంతో కేంద్రప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తదితర అన్ని విద్యాసంస్థలపై  జూలై నెలాఖరు వరకు తెరవకూడదని అన్‌లాక్‌-2 మార్గదర్శకాలలో పేర్కొంది. సినీ, వ్యాపార, పరిశ్రమల రంగాలపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. విద్యారంగంపై కూడా కరోనా ప్రభావం పడుతుండటంతో విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కరోనా మహమ్మారి ఇప్పట్లో విడిచిపెట్టేలా లేదు. అది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ అంతవరకు స్కూళ్ళు, కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకోకపోతే విద్యా సంవత్సరం ఆలస్యమవుతుంది. సకాలంలో విద్యాసంవత్సరం ఆరంభం కాకపోతే అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో విద్యాసంస్థలను తెరిస్తే విద్యార్దులు కరోనా బారినపడే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం, విద్యావేత్తలు, మేధావులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసిన అవసరం ఉంది.

Related Post