తెలంగాణలో ప్రవేశపరీక్షలు వాయిదా

June 30, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో బుదవారం నుంచి ప్రారంభం కావలసిన ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, పీఈ సెట్ ప్రవేశపరీక్షలు వాయిదా పడ్డాయి. హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాలలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున, త్వరలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 రోజులు లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు ఉదయం హైకోర్టులో విచారణ చేపట్టినప్పుడు, న్యాయమూర్తి ఇదే విషయం ప్రస్తావించి హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే ప్రవేశపరీక్షలు ఏవిధంగా నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తుందా లేదా తెలుసుకొని న్యాయస్థానానికి తెలుపవలసిందిగా ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. మధ్యాహ్నం భోజన విరామం తరువాత మళ్ళీ విచారణ చేపట్టినప్పుడు కరోనా  కారణంగా అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలని  ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున ఇప్పట్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం కష్టమే కావచ్చు. 


Related Post