పదో తరగతి విద్యార్దులూ పరీక్షలకు సిద్దంకండి: మంత్రి సబిత

May 07, 2020
img

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కరోనా కారణంగా వాయిదా పడిన 10వ తరగతిలోని మిగిలిన 8 పరీక్షలను త్వరలో నిర్వహించాలనుకొంటున్నాము. పరీక్షల నిర్వహణ కోసం అనుమతి కోరుతూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాము. కనుక హైకోర్టు అనుమతి లభించగానే ఎప్పుడైనా 10వ తరగతిలోని మిగిలిన 8 పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది కనుక మళ్ళీ విద్యార్దులందరూ పరీక్షలు వ్రాసేందుకు సిద్దంగా ఉండమని కోరుతున్నాను,” అని అన్నారు. 

ఇంటర్మీడియెట్ విద్యార్దులలో 856 మంది ఇంకా ఒక పరీక్ష వ్రాయవలసి ఉంది. ఆ పరీక్షను మే 18వ తేదీన నిర్వహిస్తాము. ఈ నెల 12 నుంచి 33 కేంద్రాలలో ఇంటర్మీడియెట్ పరీక్షపత్రాలను దిద్దే ప్రక్రియను ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమం పూర్తవగానే జూన్ రెండో వారంలో ఫలితాలు ప్రకటిస్తాము. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని కాస్త ఆలస్యమవుతున్నా విద్యార్దులు విద్యాసంవత్సరం నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటాము,” అని చెప్పారు. 

పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాలను దిద్ది ఫలితాలను ప్రకటించడంలో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు కానీ కరోనా మహమ్మారి వెంటాడుతున్న నేపధ్యంలో స్కూళ్ళు, కాలేజీలు ఏవిధంగా నడిపిస్తారనే ప్రశ్నకు బహుశః విద్యాశాఖ అధికారులు త్వరలోనే జవాబు కనుగొంటారని ఆశిద్దాం.

Related Post