తెలంగాణ విద్యాశాఖ సరికొత్త ఆలోచన.. భేష్!

April 28, 2020
img

లాక్‌డౌన్‌ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? లాక్‌డౌన్‌ ఎత్తేశాక కూడా కరోనా ప్రమాదం ఉంటుంది కనుక అప్పుడు స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపారసంస్థలు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వగైరాలన్నీ ఏవిధంగా పనిచేయాలి? అనే ప్రశ్నలకు ఆయా రంగాలకు చెందినవారు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. తెలంగాణ విద్యాశాఖ కూడా వాటిలో ఒకటి. 

విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్ అధ్యక్షతన ఇటీవల ఓ సమావేశం నిర్వహించారు. దానిలో కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాల భాస్కర్, అకడమిక్ ఆఫీసర్ జె.నీరజ, సంయుక్త కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో పాఠాలు భోదించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని వారు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో చదివేవారిలో చాలా మంది పేద విద్యార్దులే ఉంటారు. వారికి ఇళ్ళలో కంప్యూటర్లు, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సౌకర్యాలు ఉండవు. కానీ ఇప్పుడు చాలామందికి మొబైల్ ఫోన్లు వాటిలో డేటా ఉంటోంది. కనుక డిగ్రీ పాఠాలను వీడియో రికార్డింగ్ చేయించి వాటిని వాట్సాప్‌ నెంబర్లకు పంపించాలని నిర్ణయించారు.   

రాష్ట్రంలో 125 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 1,270 మంది రెగ్యులర్, 845 మంది కాంట్రాక్ట్, 530 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రతీరోజు 3 పాఠాలు చొప్పున ఆన్‌లైన్‌ పాఠాలు తయారు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో తరగతులు మొదలుపెట్టవలసిన సమయంలోగానే ఈ ఆన్‌లైన్‌ పాఠాలు సిద్దమవుతాయి. 

ఇప్పటికే దేశవిదేశాలలో అనేక యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి కనుక రాష్ట్ర విద్యాశాఖ చేయబోయే ఈ ప్రయోగం కూడా విజయవంతమవుతుందని భావించవచ్చు. కానీ విద్యార్ధులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా లేదా రాయితీ ధరలపై ల్యాప్ టాప్ కంప్యూటర్లు, ఉచిత డాటా అందజేయగలిగితే నూటికి నూరు శాతంవిజయవంతమవుతుంది.

Related Post