తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు

March 19, 2020
img

ఒకపక్క కరోనా భయంతో స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అన్ని మూతపడుతుంటే రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. 10వ తరగతి పరీక్షలకు లక్షలమంది విద్యార్దులు హాజరవుతారు కనుక వాటి నిర్వహణ కోసం చాలా భారీ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. పైగా విద్యార్దులందరూ పరీక్షలకు మానసికంగా సిద్దపడి ఉంటారు కనుక పరీక్షలు వాయిదా వేయడం కంటే కరోనా వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సకాలంలో నిర్వహించడమే మేలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో నేటి నుంచి పరీక్షలు మొదలయ్యాయి. 

విద్యార్దుల ఆరోగ్యపరిస్థితిని పరిశీలించేందుకు వీలుగా గంట ముందుగానే అందరినీ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ భయంతో చాలా మంది విద్యార్దులు నోస్ మాస్కూలు ధరించి వచ్చారు. వారికి అధికారులు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్దులను గుర్తించి వారిచేత వేరే గదులలో పరీక్షలు వ్రాయిస్తున్నారు. పరీక్ష అనంతరం వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Related Post