తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

March 11, 2020
img

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా హటాత్తుగా బారీ సంఖ్యలో ఏబీవీపీకి చెందిన విద్యార్దులు అసెంబ్లీ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. విద్యారంగంపై తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వారు అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారు. వారిని అడ్డుకొనే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఏబీవీపి కార్యకర్తలు ఆవేశంతో రెచ్చిపోయారు. అదే సమయంలో వారిలో కొందరు అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



టిఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సిలర్లను నియమించకుండా, ఉపాద్యాయులను భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తోందని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూడా విడుదల చేయకపోవడంతో తమకు రావలసిన స్కాలర్‌షిప్పులు కూడా కోల్పోతున్నామని, దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పారు. పోలీసులు ఏబీవీపీ విద్యార్దులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి నేతలపై కేసులు నమోదు చేశారు.

Related Post