తెలంగాణ ఇంటర్ బోర్డుపై హైకోర్టు పిటిషన్‌

March 11, 2020
img

తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇంటర్ బోర్డుపై హైకోర్టులో మంగళవారం ఓ పిటిషన్‌ దాఖలైంది. విద్యార్దులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకూడదనే ఇంటర్ బోర్డు నిబందనను సవాలు చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నిబందన వలన విద్యార్దులు చాలా నష్టపోతున్నారని కనుక దానిని రద్దు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. అంతేకాక..ఆలస్యంగా వచ్చిన విద్యార్దులకు ఆ మేరకు అదనంగా సమయం కూడా ఇచ్చి పరీక్షలు వ్రాసేందుకు అనుమతించాలని రాపోలు భాస్కర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆయన పిటిషన్‌ను విచారణకు చేపట్టిన హైకోర్టు నేడు దానిపై విచారణ చేపడతామని తెలిపింది. 

ఇంటర్ విద్యార్దులలో చాలామంది దూర ప్రాంతాల నుంచి పరీక్షాకేంద్రాలకు సకాలంలో చేరుకోవాలనే బయలుదేరుతారు. కానీ సమయానికి బస్సులు, ఆటోలు లభించకపోవడం, ట్రాఫిక్ జామ్‌, అనారోగ్య సమస్యలు లేదా వేరే ఇతర కారణాల చేత ఎప్పుడైనా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులే సకాలంలో చేరుకోలేకపోతున్నప్పుడు విద్యార్దులు ఎలా చేరుకోగలరు? విద్యార్దులు ఏడాదిపాటు కష్టపడి చదివిన తరువాత, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలు వ్రాసేందుకు అనుమతించకూడదనే ఇంటర్ బోర్డు నిబందన వలన వారి కష్టం అంతావృదా అవుతుంది. విద్యాసంవత్సరం నష్టపోతారు. ముఖ్యంగా కౌమార్య ప్రాయంలో ఉన్న విద్యార్దులు మానసికంగా తీవ్ర ఆవేదనకు, ఆవేశం, ఒత్తిడికి గురవుతారు. ఆ ఆవేదన, క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొంటే ప్రాణమే పోతుంది. విద్యార్దుల జీవితాల కంటే ఇంటర్ బోర్డు పెట్టుకొన్న ఈ గుడ్డి నిబందన గొప్పదేమీ కాదు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేక ఆందోళన చెందుతున్న విద్యార్దులను చూసి పోలీసులు మానవత్వంతో స్పందించి తమ వాహనాలలో ఎక్కించుకొని పరీక్షా కేంద్రాల వద్ద దిగబెడుతుంటే, ఇంటర్ బోర్డు తన విద్యార్దులపట్ల అటువంటి మానవత్వం ఎందుకు చూపలేకపోతోంది? అని అధికారులు ఆలోచించి ఈ నిబందనను సడలిస్తే అందరూ హర్షిస్తారు. లేకుంటే న్యాయస్థానం చేత మొట్టికాయలు వేయించుకొన్నాక సడలించవలసి రావచ్చు.

Related Post