వాటిలో చదివితేనే చదువులు లేకుంటే...

February 17, 2020
img

గత రెండు దశాబ్ధాల నుంచి దేశంలో అన్ని రంగాల కార్పొరేటీకరణ మొదలైంది. మొదట ఆసుపత్రులు.. తరువాత విద్యావ్యవస్థ...తరువాత బహిరంగ మార్కెట్లు...టెలికాం కంపెనీలు...ఇలా చెప్పుకొంటూపోతే చాలా పెద్ద జాబితాయే ఉంది. చిన చేపను పెద చేప...పెద చేపను తిమింగలాలు మింగుతున్నట్లు దేశంలో సామాన్యులకు అందుబాటులో ఉండే చిన్న చిన్న దుకాణాలు, వీధి చివర పాఠశాలలు, ఆసుపత్రులను కార్పొరేట్ తిమింగలాలు మింగేయడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు...వారి పిల్లలు తప్పనిసరిగా వాటి దగ్గరకే వెళ్ళవలసి వస్తోంది. 

‘చదివితే ర్యాంకులు పంట పండించే ఆ కార్పొరేట్ స్కూల్..కాలేజీలలోనే చదవాలి...అప్పుడే సాధారణ విద్యార్ధి కూడా మంత్రం వేసినట్లు ‘మెరిట్ స్టూడెంట్‌’ అయిపోగలడు. లేకుంటే జీవితంలో అనామకులుగా మిగిలిపోతారనే’ భయం పుట్టించడంలో కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు సఫలం అయ్యాయి. అందుకే మధ్యతరగతి ప్రజలు వాటికి రాజపోషకులుగా మారిపోయారు. ఎక్కడో ఈశాన్యరాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేరుతున్నారంటే అవి ఎంత విస్తృతమైన నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసుకొన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 

ఇంతకీ విషయం ఏమిటంటే..రెండు తెలుగు రాష్ట్రాలలో పేరొందిన నారాయణ, చైతన్య విద్యాసంస్థల గురించి అందరికీ తెలిసిందే. కనుక హైకోర్టు కూడా తెలిసే ఉంటుందని తెలంగాణ ఇంటర్ బోర్డు భావించిందేమో..వాటికి సంబందించి అరకొర సమాచారంతో కోర్టుకు నివేదిక సమర్పించింది. దానిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిలో కల్పించిన వసతులు, నియమనిబందనలు, విద్యాబోధనకు అనుసరిస్తున్న విధానాలు, విద్యార్ధుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను, ఒత్తిళ్ళ కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న విద్యార్ధుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికలను మళ్ళీ సమర్పించాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Related Post