ఇంటర్ పరీక్షలొస్తున్నాయి జాగ్రత్త: మంత్రి సబితా

January 25, 2020
img

పరీక్షలొస్తున్నాయంటే విద్యార్దులకు టెన్షన్ మొదలవుతుంది. అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లితండ్రులు ‘బాగా చదివి పరీక్షలకు సిద్దంకమ్మని’ పదేపదే హెచ్చరిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ‘పరీక్షలొస్తున్నాయి జాగ్రత్త’ అని మంత్రి అధికారులను కూడా హెచ్చరించడమే విశేషం. ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నందున రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత ఏడాది జరిగిన పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే పరీక్షల నిర్వహణపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకోండి. పరీక్షాపత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఈసారి ఎటువంటి పొరపాట్లు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈసారి ఎక్కడా పొరపాట్లు జరగడానికి వీలులేదు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి. పరీక్షలకు ముందు తరువాత విద్యార్దులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వారికి సహాయపడేందుకు ఇంటర్ బోర్డులో ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించండి. ఈసారి పరీక్షలను నిర్వహిస్తున్న సీజీజీ పనితీరును మొదటినుంచే పరిశీలిస్తూ ఏవైనా లోపాలు కనబడితే వెంటనే సరిదిద్దాలి,” అని హెచ్చరించారు. 

మంత్రి సబితా రెడ్డి చేసిన ఈ సూచనలు లేదా హెచ్చరికలను చూస్తే ఇంటర్ పరీక్షలు విద్యార్ధులకే కాదు...ఇంటర్ బోర్డు అధికారులకు కూడా పరీక్షగానే మారినట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఇంటర్ పరీక్షఫలితాలలో ఏర్పడిన గందరగోళం కారణంగా 26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అయినా బోర్డు అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకొంటూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. దాంతో ఇంటర్ బోర్డు వద్ద విద్యార్దులు, వారి తల్లితండ్రులు, ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు ఆందోళనలు చేశారు. ఈ అవాంఛనీయ పరిణామాలతో ఇంటర్ బోర్డ్ ప్రతిష్ట మసకబారింది...ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. న్యాయస్థానంలో మొట్టికాయలు వేయించుకోవలసివచ్చింది. చివరికి మళ్ళీ మూడున్నర లక్షల పరీక్షాపత్రాలను మూల్యాంకనం చేయవలసివచ్చింది. ఈ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు అధికారులను హెచ్చరించారు. కనుక ఈసారి మళ్ళీ అటువంటి పొరపాట్లు పునరావృతం కావనే ఆశిద్దాం.

ఈ ఏడాది మార్చి 4 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 5 నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు మొదలవుతాయి.

Related Post