ఆర్మీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

December 21, 2019
img

ఆర్మీ, పారామిలటరీ తదితర ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ అవసరం ఉంటుంది. అది తెలియక చాలామంది రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు వెళ్ళి ఎంపిక కాలేక నిరాశతో తిరిగి వస్తుంటారు. ఈ సమస్యను గుర్తించిన బీసీ స్టడీ సర్కిల్ బీసీ, ఈబీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్ధులకు ఈ ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న అర్హులైన అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 

దీనికి కనీసం 10వ తరగతి పాసైన 18-27 సం.లలోపు వయసు, కనీసం 167 సెం.మీ ఎత్తు, 77 సెం.మీ ఛాతి కొలతలు కలిగిన యువకులు అర్హులు. శిక్షణకు ఎంపికైనవారికి హైదరాబాద్‌ పంపించి అక్కడ కైరోస్‌ కాంపోజిట్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 45 రోజులు శిక్షణనిప్పిస్తారు. శిక్షణ సందర్భంగా అభ్యర్ధులకు ఉచిత హాస్టల్ సౌకర్యం కల్పించబడుతుంది. ఈ శిక్షణ పొందాలని ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, కుటుంబ ఆదాయ, కుల దృవీకరణ పత్రాలతో ఈనెల 24లోపుగా బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ శిక్షణకు సంబందించి మరింత సమాచారం కోసం 08742–227427, 9573859598 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చునని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత తెలియజేశారు. 

ఆర్మీ, పారామిలటరీ ఉద్యోగాలకు ఎంపిక అవడం ఎంత కష్టమో, ఎంపికైన తరువాత వాటి శిక్షణ కూడా అంతే కష్టంగా ఉంటుంది. కానీ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పూర్తిచేసుకొన్నట్లయితే మంచి జీతం, సౌకర్యాలు, సమాజంలో గౌరవం లభిస్తాయి. పారామిలటరీలో సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ వంటి ఉద్యోగాలు లభిస్తే అదృష్టమే. 

Related Post