పదవ తరగతి పరీక్షలు వ్రాయనున్న వీణావాణీ

December 19, 2019
img

పుట్టుకతోనే తలలు అతుక్కొని జన్మించిన అవిభక్త కవలలు వీణావాణీలకు వైద్యులు ఆపరేషన్ చేసి విడదీయలేకపోయారు. వారికి ఆపరేషన్ చేసి విడదీసే ప్రయత్నం చేస్తే వారిలో ఒకరు లేదా ఇద్దరూ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు భావించడంతో ఎవరూ వారికి ఆపరేషన్ చేసే సాహసం చేయలేకపోయారు. కానీ  ఏనాటికైనా తమను విడదీయగల వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందనే ఆశతో వారిరువురూ గత 14 ఏళ్లుగా నరకం అనుభవిస్తూనే పెరిగిపెద్దవారయ్యారు. వారు తమ పరిస్థితికి క్రుంగిపోకుండా చక్కగా చదువుకొంటున్నారు కూడా. హైదరాబాద్‌ సేవాసదన్‌లో ఉంటున్న వారిరువురూ వెంగళ్రావునగర్‌లోని ప్రభుత్వ పాఠశాల ద్వారా 10వ తరగతి పరీక్షలు వ్రాసేందుకు సిద్దం అవుతున్నారిప్పుడు. 

అయితే వారు అవిభక్త కవలలు కనుక పరీక్షలు వ్రాయడానికి ప్రత్యేక అనుమతి అవసరం. వారిరువురికీ వేర్వేరుగా హాల్ టికెట్లు కేటాయించి, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి చేత 10వ తరగతి పరీక్షలు వ్రాయించవలసి ఉంటుంది. ఆవిధంగా పరీక్షలు వ్రాయాడానికి అనుమతి కోరుతూ వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు. వీణావాణీల పరిస్థితి గురించి సిఎం కేసీఆర్‌తో సహా అందరికీ తెలుసు కనుక ప్రభుత్వం వారికి వేర్వేరుగా 10వ తరగతి పరీక్షలు వ్రాయాడానికి అనుమతిస్తుందని వారి తల్లితండ్రులు, ఉపాద్యాయులు ఆశిస్తున్నారు.

Related Post