వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో కొత్త కోర్సులు

December 17, 2019
img

విద్యార్దులు 10వ తరగతి పూర్తిచేసిన తరువాత ఇంటర్‌లో చేరుతున్నప్పుడు వారికి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దాంతో విద్యార్దులకు నచ్చినా నచ్చకపోయినా వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకోక తప్పడం లేదు. ఆ కారణంగా తరువాత వారు ఇంజనీరింగ్ లేదా మెడిసన్, సీఏ కోర్సులవైపు వెళ్ళి మళ్ళీ అక్కడా ఇబ్బందిపడవలసివస్తోంది. ఇంటరులో సరైన గ్రూపు ఎంపిక చేసుకోకపోవడం వలన చదువులు పూర్తయిన తరువాత సరైన ఉద్యోగం, ఉపాధి సంపాదించుకోలేక యావత్ జీవితం అవస్థలు పడుతున్నవారు కోకొల్లలున్నారు. 

ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌లో ఐ‌టి, అకౌంటెన్సీ, టాక్సేషన్, కామర్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త కోర్సులలో విద్యార్దులకు పాఠాలు చెప్పాలంటే ముందుగా లెక్చరర్లు కూడా వాటిపై పూర్తి అవగాహన, పట్టు కలిగిఉండాలి. కనుక ముందుగా లెక్చరర్లకు సోమవారం నుంచి మూడురోజుల పాటు అకౌంటెన్సీలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యా కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. తరువాత మిగిలిన అంశాలపై కూడా లెక్చరర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. 


Related Post